బి.ఎన్ రోడ్డు నిర్మాణం కోసం ఉధృత పోరాటాలకు సిద్ధం కావాలి : సీపీఎం జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు
రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో రావికమతం, రోలుగుంట మండలాల సీపీఎం పార్టీ సభ్యుల జనరల్ బాడీ సమావేశం ఈ. చిరంజీవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్నికల ముందు చోడవరం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
బి.ఎన్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, చోడవరం షుగర్ ఫ్యాక్టరీని పరిరక్షిస్తామని ఎమ్మెల్యే, ఎంపీ హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా ఎలాంటి పురోగతి కనిపించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉన్నప్పటికీ, వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
గతంలో పొట్టిదారుపాలెం, గర్నికం, మేడివాడ గ్రామాల పరిధిలో రహదారిని తవ్వి మెటల్, క్రషర్ బుగ్గు వేసి పనులను మధ్యలోనే నిలిపివేయడంతో గ్రామాల్లో దుమ్ము, ధూళి సమస్య తీవ్రంగా మారిందన్నారు. దీనివల్ల చిన్నారులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే నాణ్యమైన తారు రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం రహదారిపై ఏర్పడిన భారీ గోతులు చెరువులను తలపిస్తున్నాయని, సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలను సమీకరించి ఆ గోతుల్లో చేపల వేట నిర్వహిస్తూ వినూత్న ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర పేరుతో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం, రావికమతం ప్రధాన కేంద్రంలో ఇప్పటికీ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు. అలాగే నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాల్లో తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు రెవెన్యూ రికార్డుల్లో హక్కులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో మిలిటెంట్ స్థాయి పోరాటాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు, గేమిల వాసు, కిలో నరసయ్య, ఈ. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
0 Comments