వెన్నుపోటుకు రెండేళ్లు.. నర్సీపట్నంలో వైఎస్సార్‌సీపీ భారీ బైక్ ర్యాలీ
నర్సీపట్నం ( పబ్లిక్ సత్తా )కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిన అన్యాయాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం నర్సీపట్నంలో ఉత్సాహభరితంగా జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్, చింతకాయల సన్యాసి పాత్రుడు ఏకా శివ సుర్ల నాయుడు పలువురు ముఖ్య నాయకులు పాల్గొని బైక్ ర్యాలీకి నాయకత్వం వహించారు.
చీబీఎమ్ కాంపౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ త్రీ రోడ్స్ జంక్షన్ మీదుగా బొడ్డుపల్లి కూడలి వరకు భారీగా సాగింది. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో గంట సమయం పాటు ట్రాఫిక్ అంతరం జరిగింది. కాగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలువురు సహకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పెట్ల ఉమాశంకర్ గణేష్, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. గత రెండేళ్లుగా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగుతోందని విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఉద్యమాలను కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ పోరాటం మరింత ఉధృతం అవుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ సతీమణి కళావతి నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, మహిళా ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, తాజ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సోషల్ మీడియా కార్యకర్తలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలను నిరసించారు.

0 Comments