పండ్ల తోటల సాగుతో రైతులు ఆదాయం పెంచుకోవాలి : ఏపీఓ సూర్యమణి.
గొలుగొండ, (పబ్లిక్ సత్తా) జూన్ 16: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలోని సాలిక మల్లవరం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ఏపీఓ సూర్యమణి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులు, రైతులతో ఆమె మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు రైతులు పండ్ల తోటల సాగు చేపట్టి భవిష్యత్తులో మెరుగైన ఆదాయాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. పండ్ల తోటలు ఏర్పాటు చేయడం ద్వారా రైతు కుటుంబాలకు దీర్ఘకాలికంగా ఆర్థిక లాభాలు చేకూరుతాయని తెలిపారు.
మొక్కలు నాటిన తర్వాత మూడు సంవత్సరాల పాటు వాటిని సంరక్షిస్తూ సాగు నిర్వహిస్తే రైతు కుటుంబాలకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో పామ్ ఆయిల్ సాగు కూడా లాభదాయకంగా ఉంటుందని వివరించారు.ఉపాధి హామీ జాబ్ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులు తమ తోటల్లోనే పనిచేయడం ద్వారా ఉపాధి హామీ కింద లభించే కూలీ మొత్తాన్ని పొందవచ్చని తెలిపారు. పండ్ల తోటల నిర్వహణకు అవసరమైన ఎరువులు, ఇతర సామగ్రి కొనుగోలు చేసిన ఖర్చులను బిల్లుల ఆధారంగా ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు.
జూలై నెల నుంచి ప్రస్తుత జాబ్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను ఉపాధి హామీ శ్రామికులకు పంపిణీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో విఆర్పీ పి. భూదేవి, గ్రామ టీడీపీ అధ్యక్షుడు మల్లేశ్వరరావు, కన్వీనర్ ఇంద శ్రీను, మెట్లు మరియు ఉపాధి హామీ శ్రామికులు పాల్గొన్నారు.


0 Comments