రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మరోసారి వంతల నాగేశ్వరరావుకు బాధ్యతలు
పాడేరు, (పబ్లిక్ సత్తా) ఆదివాసీల హక్కుల పరిరక్షణ, రాజ్యాంగబద్ధ చట్టాల అమలు కోసం నిరంతరం పోరాడుతున్న ప్రతిష్ఠాత్మక సంస్థ ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ఏఎస్పీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని జాతీయ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పోలవరం జిల్లా గంగవరం మండల కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నికలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం సుండ్రుపుట్టు (పాడేరు)లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంతల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, గెమ్మెలి బొంజుబాబు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశమై రాష్ట్ర కమిటీ ఎన్నికల వివరాలను అధికారికంగా ప్రకటించింది.రాష్ట్ర నూతన కార్యవర్గం
- రాష్ట్ర అధ్యక్షుడు – కాకి మధు (ఏలూరు జిల్లా)
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి – కుంజా శ్రీను (పోలవరం జిల్లా)
- రాష్ట్ర ఉపాధ్యక్షులు – వాబా యోగి (శ్రీకాకుళం జిల్లా), వంతల నాగేశ్వరరావు (అల్లూరి సీతారామరాజు జిల్లా)
- రాష్ట్ర సహాయ కార్యదర్శి – కుంజం కృష్ణంరాజు (ఏలూరు జిల్లా)
- రాష్ట్ర కోశాధికారి – ఎడ్ల సూర్యనారాయణ (పార్వతీపురం మన్యం జిల్లా)
ఇతర జిల్లాలకు చెందిన మరో 20 మంది నాయకులను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జాతీయ కమిటీ ప్రకటించింది. అల్లూరి జిల్లా నుంచి చెండా లోహిదాసు, సమర్ది విజయకుమారి, కీల్లో బాబురావు, సోమేల బాలరాజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంతల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తనపై మరోసారి విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన జాతీయ కమిటీకి, ఉద్యమ సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసీ జాతి సంక్షేమం, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి, ప్రత్యేక చట్టాల అమలు, రాజ్యాంగ హక్కుల సాధన, ఆదివాసీ భాషా, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. “ఆదివాసీ జాతి హక్కుల సాధన కోసం నా చివరి శ్వాస వరకు పోరాటం కొనసాగిస్తాను” అని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాలపై ఉద్యమాలు ఉధృతం
ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 భూ బదిలీ నియంత్రణ చట్టం, పేసా చట్టం, అటవీ హక్కుల చట్టం-2006 అమలులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వంతల నాగేశ్వరరావు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రజాప్రతినిధులు వైఖరి మార్చుకోవాలి
రిజర్వేషన్లు, ప్రత్యేక చట్టాల ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకున్న కొందరు ఆదివాసీ ప్రజాప్రతినిధులు సొంత జాతి హక్కుల కోసం పనిచేయకుండా రాజకీయ పార్టీల ప్రయోజనాలకు పరిమితమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తమ వైఖరిని మార్చుకుని చట్టసభల్లో ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం గళం విప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సమర్ది సింహాద్రి, కొర్ర మల్లమ్మ, సమర్ది విజయకుమారి, గెమ్మెలి బొంజుబాబు, సోమేల బాలరాజు, జర్త మల్లేశ్వరరావు, జల్లి రాంబాబు, జల్లి చిట్టిబాబు, జల్లి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.


0 Comments