గొలుగొండ( పబ్లిక్ సత్తా) మండలంలో భూముల రీసర్వే ప్రక్రియ రైతులకు శాపంగా మారిందని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని పలువురు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు గొలుగొండ తహసీల్దార్ కాకర నూకరాజును కలిసి రీసర్వే విషయంలో రెవేన్యూ అధికారులు పారదర్శకత పాటించాలని రైతుల దరుపున వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూముల రీసర్వేపై రెవెన్యూ అధికారులు రైతులకు ఎటువంటి కనీస సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. అధికారులు ఏకపక్ష నిర్ణయాలతో రీసర్వే ప్రక్రియ సాగుతోందని, దీనివల్ల తమ భూముల పరిస్థితి ఏమిటో అర్థంకాక రైతులు అయోమయంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు నచ్చినట్లుగా రీసర్వే నిర్వహిస్తూ రైతుల భూములకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే స్పందించి రైతులకు అనుకూలంగా పారదర్శకమైన రీసర్వే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మణికుమారి, జడ్పీటీసీ గిరిబాబు, మండల వైసీపీ అధ్యక్షులు ఫాణి శాంతారామ్, మాజీ సర్పంచులు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments