- భారీ యంత్రాలతో మట్టి తరలింపు
గ్రామస్తుల కథనం ప్రకారం, చెరువులో జరుగుతున్న తవ్వకాలను ప్రశ్నించగా తవ్వకాల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, "మీ చేతనైనది చేసుకోండి" అంటూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపించారు. అంతేకాకుండా, అవసరమైతే పోలీసుల సహకారంతోనే తవ్వకాలు కొనసాగిస్తామని పేర్కొన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
గతంలో ఈ చెరువులో ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టి, సాగునీటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దినట్లు గ్రామస్తులు గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న మట్టి తవ్వకాల కారణంగా చెరువు ఆకృతి పూర్తిగా మారిపోయి, వ్యవసాయ భూమిలా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ తవ్వకాలను నర్సీపట్నానికి చెందిన పలువురు వ్యక్తులు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. తవ్వకాలు వెంటనే నిలిపివేసి చెరువును పరిరక్షించాలని వారు అధికారులను కోరారు.
ఈ ఘటనపై కసిమి విఆర్ఓ మణికంఠను వివరణ కోరగా, సమాచారం అందిన వెంటనే స్థానిక వీఆర్ఏను ఘటన స్థలానికి పంపించి పనులు నిలిపివేసినట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమి యాజమాన్యం, హక్కులపై స్పష్టత వచ్చే వరకు ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని సంబంధిత వ్యక్తులను హెచ్చరించినట్లు ఆయన వెల్లడించారు.
గ్రామస్తులు చెరువు పరిరక్షణ కోసం అధికారులు కఠిన చర్యలు తీసుకుని అక్రమ తవ్వకాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

0 Comments