పాకల పేరుతో మొదలై.. వేల రూపాయలకు షెడ్ల విక్రయాలు!
అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎప్పుడు?గొలుగొండ (పబ్లిక్ సత్తా): ప్రభుత్వ స్థలాలు ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సింది పోయి అక్రమార్కులకు అడ్డాగా మారుతున్నాయా? అధికారుల కళ్ల ముందే ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడా? అనే ప్రశ్నలు గొలుగొండ మండలం పాతమల్లంపేట రెవెన్యూ పరిధిలోని జోగంపేట జంక్షన్, ద్వారకానగరం పశువుల మార్కెట్ సమీపంలో వినిపిస్తున్నాయి.
స్థానికుల సమాచారం మేరకు.. గతంలో పాకలుగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ స్థలాల్లో ప్రస్తుతం రేకుల షెడ్లు వెలుస్తున్నాయని, వాటిని వేల రూపాయలకు ఇతరులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలను ఇలా యథేచ్ఛగా ఆక్రమించి, వాటిపై నిర్మాణాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇక అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను అధికారులు తొలగించేందుకు ప్రయత్నిస్తే.. అదే అక్రమ నిర్మాణదారులు అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం పరిపాటిగా మారుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ముందుగానే అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను అడ్డుకోకపోతే, తరువాత వాటిని తొలగించడం పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యానికి కారణమేంటి? అక్రమ నిర్మాణాల వెనుక ఎవరెవరి హస్తం ఉంది? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, దీనిపై అధికారుల నుంచి స్పష్టమైన వివరణ రావాల్సి ఉంది.
ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయా? అక్రమంగా షెడ్లు నిర్మించి విక్రయాలు జరుగుతున్నాయా? అనే అంశాలపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను వెంటనే అడ్డుకుని, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
లేనిపక్షంలో ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందిస్తారా? లేక ప్రభుత్వ భూముల్లో అక్రమ దందాకు పచ్చజెండా ఊపుతారా? వేచి చూడాల్సిందే!

0 Comments