ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ
ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపిన, పీవీఎస్ఎన్ రాజుచోడవరం, జూలై 29 (పబ్లిక్ సత్తా): కళ్యాణపులోవ రిజర్వాయర్ పరిధిలో జరుగుతున్న ఆక్రమణలు, అక్రమ తవ్వకాలపై అధికారుల నిర్లక్ష్య వైఖరిపై చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ పీవీఎస్ఎన్ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తాను చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా కేంద్ర మాజీ ఇంధన శాఖ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ స్పందించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో పాటు సంబంధిత అధికారులకు లేఖ రాశారని తెలిపారు.1970లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణపులోవ రిజర్వాయర్ ద్వారా 14 గ్రామాలకు చెందిన 4,484 ఎకరాలకు సాగునీరు అందుతోందని రాజు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలు, వ్యర్థాల కారణంగా జలాశయానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపించారు. రిజర్వాయర్ వెనుక భాగంలో సుమారు 45 ఎకరాల మేర జలాశయ గర్భం పూడుకుపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే కొండగెడ్డలు, ఊటగెడ్డల నీరు జలాశయంలోకి చేరకుండా మట్టి దిబ్బలు అడ్డుగా మారాయని తెలిపారు.
ఈ సమస్యపై గిరిజన సంఘాలు, రైతులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. దీంతో తాను ఇటీవల కళ్యాణపులోవ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించి, సమస్యను ప్రజలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.
కళ్యాణపులోవ ప్రాంతానికి జరుగుతున్న నష్టంపై స్పందించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు లేఖ రాసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మకు ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. విలువైన జలాశయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఈ అంశాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి నేరుగా తీసుకెళ్తామని పీవీఎస్ఎన్ రాజు తెలిపారు.


0 Comments