తాండవ రిజర్వాయర్ ఘాట్ రోడ్డుపై మృత్యువు మాటువేసిందా..? రక్షణ లేక వాహనదారుల్లో ఆందోళన
గొలుగొండ/నాతవరం (పబ్లిక్ సత్తా): అనకాపల్లి జిల్లాలోని గొలుగొండ–నాతవరం లింక్ రోడ్డులో తాండవ రిజర్వాయర్ డ్యామ్ సమీపంలోని ఘాట్ రోడ్డుపై ప్రయాణం రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తైన కొండ అంచున ఉన్న ఈ రహదారికి శాశ్వత రక్షణ కంచెలు లేకపోవడంతో ప్రతి ప్రయాణం ప్రాణాలను పణంగా పెట్టినట్టే మారిందని వారు అంటున్నారు.ఈ ఘాట్ రోడ్డులోని పలు మలుపులు అత్యంత ప్రమాదకరంగా ఉండగా, ముఖ్యంగా యూ-టర్న్ ప్రాంతంలో రహదారి ఇరుకుగా ఉండటం వల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఒకవేళ వాహనం అదుపు తప్పినా, డ్రైవర్ చిన్న పొరపాటు చేసినా వాహనం నేరుగా రోడ్డుకింద ఉన్న తాండవ రిజర్వాయర్లో పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
గతంలో రోడ్డుకు రక్షణగా ఏర్పాటు చేసిన దిమ్మలు శాశ్వత నిర్మాణాలు కాకపోవడంతో కాలక్రమేణా తొలగిపోయాయి. ప్రస్తుతం అక్కడ ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడం ప్రమాద భయాన్ని మరింత పెంచుతోంది.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఘాట్ రోడ్డుకు ఇరువైపులా శాశ్వత ఐరన్ గార్డ్రైల్స్ ఏర్పాటు చేయడంతో పాటు యూ-టర్న్ వద్ద రహదారిని వెడల్పు చేయాలని, హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ నియంత్రణ సూచికలను ఏర్పాటు చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.
ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎంతో అవసరమని ప్రజలు సూచిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన భద్రతా చర్యలు చేపట్టి వాహనదారుల ప్రాణాలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

0 Comments